కూటమి మొత్తం ఏకమైనా.. భీమిలి టూ విజయనగరం ఫైటర్ బొత్స అనూష!

రాజకీయాల్లో గెలుపోటములు కేవలం సంఖ్యాబలంతోనే కొలుస్తారా.. లేక ప్రతికూల పరిస్థితుల్లోనూ పోరాడిన నైతిక ధైర్యాన్ని చూసి కొలుస్తారా? ఉత్తరాంధ్ర కూటమి పెద్దలంతా ఏకమై చుట్టుముట్టినా.. బొండపల్లి లోకల్​ ఫైట్​లో ఒంటరిగా నిలబడి పోరాడిన బొత్స సత్యనారాయణ కుమార్తె బొత్స అనూష రాజకీయ సత్తా ఏంటి?భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న బొత్స అనూషకు అసలు జడ్పీటీసీగా పోటీ చేయాలన్న ఆలోచనే లేదు. కానీ పార్టీ అధిష్టానం ఆదేశించగానే.. బొండపల్లిలో పార్టీకి తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని తెలిసినా ఒక్క క్షణం కూడా వెనుకంజ వేయకుండా నామినేషన్ వేసి రంగంలోకి దిగారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా ఎదుగుతున్న బొత్స అనూష.. భీమిలి నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. భీమిలిలో కేడర్‌ను సమన్వయం చేయడం, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే ఆమె ప్రధాన ఎజెండా. జడ్పీటీసీగా ఎన్నికల బరిలోకి దిగాలన్న ఆలోచన ఆమెకు ఏ కోశానా లేదు.

అయితే గజపతినగరం పరిధిలోని బొండపల్లి జెడ్పీటీసీ స్థానంలో పార్టీ పరిస్థితి సంక్లిష్టంగా మారడంతో.. పార్టీ అధినాయకత్వం అనూషను పోటీ చేయాల్సిందిగా ఆదేశించింది. విజయనగరం జిల్లాలో కూటమికి సవాల్ విసరాలంటే బొత్స కుటుంబం నుంచి బలమైన గళం ఉండాలని పార్టీ నిర్ణయించింది. స్థానికంగా పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిసినప్పటికీ.. పార్టీ మాటకు కట్టుబడి, ఎలాంటి సంకోచం లేకుండా అనూష నామినేషన్ దాఖలు చేసి రణరంగంలోకి దూకారు.

బొండపల్లి జెడ్పీటీసీ ఎన్నికల్లో అనూష నామినేషన్ వేయడం వెనుక చాలా పెద్ద రాజకీయ నేపథ్యమే ఉంది. గజపతినగరం పరిధిలోని బొండపల్లిలో వైఎస్సార్సీపీ తరఫున ఎవరూ నామినేషన్ వేయకుండా చేసి, సీటును ఏకగ్రీవం చేసుకోవాలని అధికార కూటమి పక్కా వ్యూహం రచించింది.మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే బేబినాయనతో పాటు మొన్నటి వరకు వైసీపీలో బొత్స నీడన పెరిగి టీడీపీలోకి జంప్ చేసిన మాజీ జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను స్థానిక నేతలపై తీవ్ర ఒత్తిళ్లు తెచ్చారు. ఆ సమయంలో అనూష స్వయంగా నామినేషన్ వేయడంతో కూటమి కుట్రలన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. బొండపల్లిలో ఏకగ్రీవానికి గండిపడటమే కాకుండా.. కూటమి అగ్రనేతలంతా బొండపల్లిలోనే మోహరించాల్సిన అనివార్య పరిస్థితి ఏర్పడింది.

ఈ ఎన్నికల్లో అనూష ప్రదర్శించిన నాయకత్వ పటిమ రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. ఒకవైపు బొండపల్లిలో హోరాహోరీగా ప్రచారం చేస్తూనే.. మరోవైపు జీవీఎంసీ పరిధిలోని భీమిలి వార్డులను సమన్వయం చేశారు.భీమిలిలో ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు నేతృత్వంలోని కూటమి అధికార బలాన్ని తట్టుకుని.. అక్కడ పోటీ చేసిన ఇద్దరు వైఎస్సార్సీపీ కార్పొరేటర్లను గెలిపించుకోవడంలో అనూష తెరవెనుక కీలక పాత్ర పోషించారు. అటు గ్రేటర్ విశాఖలో పార్టీకి రెండు కీలక స్థానాలను అందిస్తూనే.. ఇటు విజయనగరం పల్లెల్లో కూటమి పెద్దలను ముచ్చెమటలు పట్టించేలా ప్రచార హోరును కొనసాగించారు.

బొండపల్లిలో అనూష ప్రచార దూకుడు చూసి ఒక దశలో కూటమి అగ్రనాయకత్వానికి ఓటమి భయం పట్టుకుంది. నియోజకవర్గంలో పూర్తి ప్రభుత్వ బలం, యంత్రాంగం, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ.. అనూషకు ప్రజల నుంచి లభించిన ఆదరణ కూటమి నేతలను హడలెత్తించింది.

దీంతో చివరి నిమిషంలో అధికార బలాన్ని ప్రయోగించి, స్థానిక నేతలను బెదిరింపులకు గురిచేసి, ప్రలోభాలు పెట్టి క్రాస్ ఓటింగ్ చేయించుకున్నారనే చర్చ ఇప్పుడు తెరపైకి వచ్చింది. అయినప్పటికీ.. కూటమి భారీ విజయాన్ని సాధించలేకపోయింది. ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్న మండలంలో సైతం కూటమి మెజార్టీ కేవలం 5,136 ఓట్ల వద్దే ఆగిపోవడం.. క్షేత్రస్థాయిలో అనూష చేసిన గ్రౌండ్‌వర్క్‌కు నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు.

బొండపల్లిలో ఫలితం చేజారినప్పటికీ.. విజయనగరం జిల్లా పరిషత్ పోరులో వైఎస్సార్సీపీ సాధించిన అతిపెద్ద విజయాల వెనుక అనూష కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. చీపురుపల్లి నియోజకవర్గంలో ఆమె గతంలో నిర్మించిన నెట్‌వర్కే నేడు గరివిడి, గుర్ల మండలాల్లో వైసీపీకి అఖండ విజయాలను తెచ్చిపెట్టింది.

గరివిడిలో ఎమ్మెల్యే కళా వెంకట్రావు కోడలిని ఓడించి బొత్స పూజిత సాధించిన విజయం.. గుర్లలో సంగంరెడ్డి వెంకటలక్ష్మి సాధించిన గెలుపు వెనుక అనూష క్షేత్రస్థాయిలో వేసిన పునాదులే కీలక పాత్ర పోషించాయి. కార్యకర్తలను ఐక్యం చేస్తూ, మహిళా విభాగాలను యాక్టివేట్ చేస్తూ ఆమె చేసిన నిరంతర శ్రమే నేడు రెండు మండల పరిషత్‌లను వైసీపీ ఖాతాలో పడేలా చేసింది.

కూటమి నేతలంతా ఒక్కటై బొండపల్లిలో అనూషను ఓడించామని సంబరపడుతుండవచ్చు.. కానీ అధికార బలం, బెదిరింపులు, కుట్రలను తట్టుకుని ఒంటరిగా పోరాడిన బొత్స అనూషదే అసలైన నైతిక విజయమని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు.ఒకవైపు భీమిలిలో పార్టీకి విజయాలు అందిస్తూనే, మరోవైపు విజయనగరంలో బొత్స బ్రాండ్‌ను కాపాడుతూ ధైర్యంగా నిలబడింది అనూష.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *