కూటమి గాలిలోనూ బొత్స పవర్! అనూష గ్రౌండ్‌వర్కే అసలైన గేమ్ ఛేంజరా?

రాష్ట్రవ్యాప్తంగా అధికార కూటమి ప్రభంజనం వీస్తున్న వేళ.. విజయనగరం జిల్లా స్థానిక సంస్థల సమరంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కంచుకోటలా నిలబడటం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో చాలా ప్రాంతాల్లో ప్రతిపక్ష నేతలు ఆత్మరక్షణలో పడి నామినేషన్లు వేయడానికే వెనుకంజ వేశారు. కానీ విజయనగరంలో మాత్రం సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూటమి సవాల్‌ను స్వీకరించి స్వయంగా తన కుటుంబ సభ్యులనే ఎన్నికల బరిలోకి దించారు. జిల్లాలోని 27 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా ప్రత్యర్థులకు ఏకగ్రీవం కాకుండా అడ్డుకోవడమే కాకుండా, అధికార పార్టీకి కళ్లుచెదిరే రీతిలో షాక్ ఇచ్చారు.

ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన హై-వోల్టేజ్ పోరు గరివిడి జెడ్పీటీసీ. చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు తన కోడలు కిమిడి సంధ్యను టీడీపీ తరఫున రంగంలోకి దించగా.. బొత్స కుటుంబం తమ కోడలు బొత్స పూజితను బరిలో నిలిపింది. కౌంటింగ్ ప్రారంభమైన తొలి రౌండ్ నుంచే పూజిత తిరుగులేని లీడ్‌తో దూసుకుపోయి అఖండ విజయాన్ని నమోదు చేశారు. అంతేకాకుండా గరివిడి మండలంలోని మెజార్టీ ఎంపీటీసీ స్థానాలను సైతం వైఎస్సార్సీపీ చేజిక్కించుకుని మండల పరిషత్ పీఠాన్ని సునాయాసంగా దక్కించుకుంది. సిట్టింగ్ ఎమ్మెల్యే సొంత గడ్డపైనే ఆయన కోడలిని ఓడించి మండలాన్ని కైవసం చేసుకోవడం కళా వెంకట్రావుకు తీరని ఎదురుదెబ్బగా మిగిలింది.

అటు సమీప గుర్ల మండలంలోనూ బొత్స వ్యూహం పూర్తిస్థాయిలో ఫలించింది. గుర్ల జెడ్పీటీసీ నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన బొత్స సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి.. కూటమి అభ్యర్థిపై ప్రారంభ రౌండ్ల నుంచే ఏకపక్ష ఆధిక్యంతో విజయాన్ని ముద్దాడారు. గుర్ల జెడ్పీటీసీతో పాటు మండలంలోని మెజారిటీ ఎంపీటీసీ స్థానాలను సైతం వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుని మండల పీఠాన్ని దక్కించుకుంది. గత ప్రభుత్వ సంక్షేమం, బొత్స కుటుంబం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలిచిన తీరును విశ్వసిస్తూ పల్లె ఓటర్లు ఫ్యాన్ గుర్తుకే సంపూర్ణ మద్దతు పలికారు.

గరివిడి, గుర్లలో వైఎస్సార్సీపీ ఈ స్థాయిలో తిరుగులేని విజయాలు సాధించడం వెనుక తెరవెనుక నడిచిన అసలైన సూత్రధారి బొత్స సత్యనారాయణ కుమార్తె డాక్టర్ బొత్స అనూష. చీపురుపల్లి నియోజకవర్గ కేంద్రంగా ఆమె నిర్మించిన కేడర్ నెట్‌వర్క్ ఈ ఎన్నికల్లో అద్భుతమైన ఫలితాలను ఇచ్చింది. గ్రామాల్లో పర్యటిస్తూ మహిళా శ్రేణులను, యువతను సమన్వయం చేసి కార్యకర్తల్లో పోరాట పటిమను రగిలించారు. అధికార కూటమి ఒత్తిళ్లను తట్టుకుని కార్యకర్తలు బరిలో నిలబడేలా ఆమె నిర్మించిన క్షేత్రస్థాయి వ్యూహమే గరివిడిలో పూజిత, గుర్లలో వెంకటలక్ష్మి భారీ మెజార్టీలతో గెలవడానికి తిరుగులేని పునాదిగా నిలిచింది.

అయితే, చీపురుపల్లిలో ఇంతటి పటిష్టమైన గ్రౌండ్‌వర్క్ చేసిన అనూష.. పార్టీ బాధ్యతగా గజపతినగరం పరిధిలోని బొండపల్లి జెడ్పీటీసీ నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. అక్కడ స్థానిక మంత్రి అధికార దర్పం, పార్టీ మారిన మాజీ జడ్పీ చైర్మన్ చిన్న శ్రీను తెరవెనుక కుట్రలు, బొబ్బిలి ఎమ్మెల్యే బేబినాయన తెచ్చిన కుల సమీకరణాల తీవ్ర ఒత్తిడి వల్ల అనూష స్వల్ప తేడాతో గెలుపును అందుకోలేకపోయినా.. అధికార పార్టీల ఉమ్మడి చక్రవ్యూహాన్ని చివరి నిమిషం వరకు ధైర్యంగా ఎదుర్కొని తనవంతు పోరాటాన్ని చాటుకున్నారు.

మొత్తంగా చూస్తే.. కూటమి అధికార ప్రభంజనాన్ని బద్దలుకొట్టి గరివిడి, గుర్ల మండలాల్లో వైఎస్సార్సీపీ సాధించిన అఖండ విజయాలు బొత్స బ్రాండ్ రాజకీయ సత్తాను మరోసారి చాటిచెప్పాయి. తండ్రి బొత్స సత్యనారాయణ వ్యూహాలకు తోడుగా, క్షేత్రస్థాయిలో డాక్టర్ బొత్స అనూష అందించిన గ్రౌండ్‌వర్క్ బలం పార్టీకి తిరుగులేని ఊపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *