ఎమ్మెల్యే బత్తులకు ఓటర్ల షాక్.. రాజానగరంలో జక్కంపూడి రాజా దెబ్బ!

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల సమరంలో తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలో ఊహించని రాజకీయ భూకంపం సంభవించింది. సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకు నియోజకవర్గ ఓటర్లు దిమ్మతిరిగే షాక్ ఇచ్చారు. సీతానగరం జడ్పీటీసీ ఎన్నికల్లో అధికార కూటమి బలంతో బరిలోకి దిగిన ఎమ్మెల్యే సతీమణి బత్తుల వెంకటలక్ష్మి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు చేతిలో ఏకంగా 2,607 ఓట్ల భారీ తేడాతో ఆమె పరాజయం పాలయ్యారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లావ్యాప్తంగా కూటమి హవా నడిచిన వేళ.. సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే స్వంత నియోజకవర్గంలో ఆయన భార్యనే ఓడించి, జిల్లాలోనే ఏకైక జడ్పీటీసీ పీఠాన్ని పార్టీ ఖాతాలో వేయడం వెనుక మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా క్షేత్రస్థాయి రాజకీయ చాణక్యం స్పష్టంగా కనిపిస్తోంది.

ఈ ఫలితాల లెక్కింపు సరళిని గమనిస్తే మొదటి రౌండ్ నుంచే ప్రజా తీర్పు ఎంత ఏకపక్షంగా ఉందో అర్థమవుతుంది. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ వైఎస్సార్సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. ఒకానొక దశలో ఆయన లీడ్ ఏకంగా 4,500 ఓట్లకు పైగా దూసుకెళ్లింది. ఆఖరి రౌండ్ పూర్తయ్యేసరికి అధికార పార్టీ నాయకులకు ఏమాత్రం ఊపిరి సలపనివ్వకుండా భారీ ఆధిక్యంతో ఆయన విజయఢంకా మోగించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న బలరామకృష్ణ తన అధికారాన్ని, కూటమి యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో ప్రయోగించినప్పటికీ.. స్వయంగా తన భార్యను గెలిపించుకోలేకపోవడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచీ నియోజకవర్గంలో సాగిన విచ్చలవిడి మట్టి, ఇసుక అక్రమ తవ్వకాల ఆరోపణలు, పాలనలో భార్య షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంటూ వచ్చిన విమర్శలపై ప్రజల్లో పేరుకుపోయిన అసంతృప్తే ఈ ఘోర పరాజయానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

అన్నింటికంటే ఎమ్మెల్యే బత్తులకు కోలుకోలేని దెబ్బ తగిలింది ఆయన స్వగ్రామమైన గాదరాడలోనే! ఒక ప్రజాప్రతినిధికి స్వంత ఊరే రాజకీయ పునాది. కానీ ఆ పునాదే కదిలిపోయింది. గాదరాడ గ్రామంలోని రెండు ఎంపీటీసీ స్థానాల్లో జనసేన పార్టీ కనీసం తన గుర్తుపై పోటీ చేసే ధైర్యం కూడా చేయలేకపోయింది. గ్రామంలో పార్టీ పరిస్థితిపై అనుమానంతో ఆ రెండు సీట్లను టీడీపీకి వదిలేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఫలితం మారలేదు. ఎమ్మెల్యే స్వగ్రామంలోని ఒక ఎంపీటీసీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకోగా, మరో స్థానంలో కూటమి అభ్యర్థి అతి స్వల్ప మెజార్టీతో మాత్రమే గట్టెక్కగలిగారు. స్వగ్రామంలోనూ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సరిగ్గా ఇక్కడే మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా నాయకత్వ పటిమ నిరూపితమైంది. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలినా.. కుంగిపోకుండా కేడర్‌ను వెన్నంటి నడిపించారు. నామినేషన్ల ఘట్టం నుంచి కౌంటింగ్ వరకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచి, అధికార కూటమి దౌర్జన్యాలను, ప్రలోభాలను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. సీతానగరంలో ఎమ్మెల్యే భార్యపైనే అభ్యర్థిని నిలబెట్టి, వ్యూహాత్మకంగా ప్రచారం నడిపించి జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకోవడం రాజా సాధించిన అతిపెద్ద రాజకీయ విజయం.

ఎమ్మెల్యే స్వంత ఊళ్లోనే పార్టీని గెలిపించి, సీతానగరం ఎంపీపీ, జడ్పీటీసీలను వైఎస్సార్సీపీ వశం చేయడంలో రాజా చూపిన దూకుడు కేడర్‌లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.

మొత్తంగా చూస్తే.. అధికారంలో ఉన్నామన్న అహంకారంతో గ్రామాల్లో సాగించిన దోపిడీకి, స్థానిక ప్రజాప్రతినిధుల తీరుకు రాజానగరం ఓటర్లు తమ ఓటుతోనే గట్టి సమాధానం చెప్పారు. ఎమ్మెల్యే స్వగ్రామంలోనే ప్రజలు ఎదురుతిరగడం, సతీమణి ఘోరంగా ఓడిపోవడం బత్తుల బలరామకృష్ణ రాజకీయ భవిష్యత్తుకు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *