- స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ దీటైన పోరు.. 30 స్థానాల్లో విజయం
- 71 స్థానాలకు గాను 30 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థుల గెలుపు
- సీతానగరం, కోరుకొండ మండలాల్లో ఎంపీపీ పీఠాలు కైవసం
రాజానగరం నియోజకవర్గంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి పార్టీలకు దీటైన పోటీ ఇచ్చింది. నియోజకవర్గ పరిధిలో మొత్తం 71 స్థానాలు ఉండగా, వాటిలో 30 స్థానాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. అధికార కూటమి పార్టీలకు గట్టి పోటీ ఇస్తూ గణనీయమైన స్థానాలను కైవసం చేసుకోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
సీతానగరం మండలంలో జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలతో పాటు 12 ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా జడ్పీటీసీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు 2,007 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది.
కోరుకొండ మండలంలో మొత్తం 23 ఎంపీటీసీ స్థానాలకు గాను వైఎస్సార్సీపీ 12 స్థానాల్లో విజయభేరి మోగించింది. ఎంపీపీ స్థానాన్ని సైతం కైవసం చేసుకుంది. జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీలతో పోటీపడి సగానికి పైగా ఎంపీటీసీ స్థానాలను గెలుచుకోవడం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది.
జక్కంపూడి రాజా నాయకత్వంలో పార్టీ శ్రేణుల సమష్టి కృషి
తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్సీపీ గెలుచుకున్న ఏకైక జడ్పీటీసీ స్థానం రాజానగరం నియోజకవర్గంలోని సీతానగరం కావడం విశేషం. అందులోనూ నియోజకవర్గ ప్రస్తుత ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ సతీమణి వెంకటలక్ష్మిపై వైఎస్సార్సీపీ అభ్యర్థి కరుటూరి శ్రీహరి బాబు విజయం సాధించడం ఎన్నికల ఫలితాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా నాయకత్వంలో పార్టీ అభ్యర్థులు, నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయడం ఈ ఫలితాల్లో ప్రతిబింబించిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని మూడు మండలాల్లోనూ కూటమి పార్టీలకు పోటీనిస్తూ 30 స్థానాలను సాధించడం స్థానిక రాజకీయాల్లో చర్చకు దారితీసింది.